కథని కథలా మాత్రమే చూడాలనే సెన్స్ లేని యూనివర్సిటీ ప్రొఫెసర్లు మనకి సైన్స్ నేర్పిస్తున్నారు

 
ఇస్రొ సైంటిస్ట్ వి. శ్రీనివాస చక్రవర్తి గారు చెప్పినట్టు గుర్తింది, "కాన్స్టెలేషన్స్ (నక్షత్ర మండలాలు) ఊహాజనితం, చంద్రుడి మీద నుంచి చూస్తే కాన్స్టెలేషన్స్ వేరే ఆకారంలో కనిపిస్తాయి" అని. ఇంత తెలిసిన సైంటిస్టులు కూడా సైన్స్ తెలియని పంతులు పెట్టిన ముహూర్తం ప్రకారం పెళ్ళి చేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఇంత సైన్స్ తెలుసుకుని ఏమి లాభం?

ప్రపంచం మొత్తం పదార్థంతో నిర్మితమైనది. మరి పదార్థం కాని దేవుణ్ణి సైంటిస్టులు ఎలా నమ్ముతున్నారు? ఈ సందేహం చాలా మంది హేతువాదుల్లో ఉంది. గాజులు బానిసలకి వేసిన చేతి సంకెళ్ళ నుంచి పరిణామం చెందాయని చాలా మంది స్త్రీవాద రచయిత్రులకి తెలియదు. స్త్రీవాద రచయిత్రులు కూడా చేతులకి గాజులు తొడుక్కుని మీటింగ్‌లలో స్త్రీ-పురుష సమానత్వం గురించి మాట్లాడుతారు. హిందు పురాణాల్లోనూ, బైబిల్‌లోనూ నక్షత్రాలు మాట్లాడుతున్నట్టు, నడుస్తున్నట్టు కథలు ఉన్నాయి. కథలు వేరు, వాస్తవం వేరు అని సైంటిస్టులు అంటారు కానీ ఆ కథలు ఎందుకు రాసారో సైంటిస్టులకి తెలియదు. పెన్మెత్స సుబ్బరాజు అనే హేతువాది అన్నారు "సైంటిస్టులు తమ రంగంలో మాత్రమే మేధావులు, తమ రంగం బయట వాళ్ళకి సాధారణ జనంతో సమానమైన తెలివి ఉంటుంది" అని. హిందీ టీచర్‌కి ఫిజిక్స్ గురించి డౌట్ అడిగితే చెప్పలేడు. సామాజిక విషయాల్లో సైంటిస్ట్ పాండిత్యం కూడా అలాగే ఉంటుంది. మత గ్రంథాల్లో కథలు ఉంటాయి తప్ప థీసెస్ (పరిశోధనలు) ఉండవు. ఈ విషయం సైంటిస్టులు గుర్తుంచుకోవాలి. మన పూర్వికులకి ప్లాస్టిక్ సర్జరీ తెలుసనీ, ఏనుగు తలని మనిషికి అంటించేవారనీ ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అన్నాడు. అతన్ని ఉద్దేశించి పెన్మెత్స సుబ్బరాజు గారు ఓ ప్రశ్న అడిగారు "ఏనుగు తలని మనిషికి అంటిస్తే ఆ మనిషి మనిషిలాగ ఆలోచిస్తాడా, ఏనుగులాగ ఆలోచిస్తాడా?" అని. ఈ ఒక్క ప్రశ్న చాలు, ఏనుగు తలని మనిషికి అంటించడం ఒక కథ మాత్రమే అని నిరూపించడానికి. మా ఊరి దగ్గర ఏనుగులు జీలుగు చెట్లు పీకేసి గుజ్జు తింటాయి. ఏనుగు తలని మనిషికి అంటిస్తే అతను అన్నం తింటాడా, జీలుగు గుజ్జు తింటాడా? కథల్లో నక్షత్రాలు మాట్లాడుతాయి, ఏనుగు తల మనిషి ఉండ్రాళ్ళు తింటాడు. కథని కథలా మాత్రమే చూడాలనే సెన్స్ లేని యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉండడం మన దౌర్భాగ్యం.

ఒక యూరోపియన్ కథలో చంద్రుడి మీద రాజు ఉంటాడు. చంద్రుడి మీద గాలి దాదాపుగా ఉండదు. అక్కడ మనుషులు బతికే అవకాశమే లేదు. ఐదు కిలో మీటర్లు ఎత్తైన కొండ మీద గాలి పీడనం అవసరం కంటే తక్కువ ఉంటుంది. అక్కడ మనిషి ఆక్సీజెన్ సిలిండర్ లేకుండా బతకలేడు. ఇక చంద్రుడి మీద రాజు & రాజ్యం అంటే ఆ రచయితకి చంద్రుడి గురించి ఏమీ తెలియదనుకోవాలి.

Comments

Popular posts from this blog

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది